- కొరవడిన రాష్ట్ర ప్రభుత్వ సహకారం
- 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పూర్తి
- మార్చి నాటికి ఆధునాతనంగా కరీంనగర్ రైల్వే స్టేషన్
- రూ.60 కోట్లతో కొత్తపల్లి స్టేషన్ ఆధునికీకరణ పనులు
- మూడు నెలల్లో ఉప్పల్ ఆర్వోబీ
కరీంనగర్ సిటీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో చేపట్టిన రైల్వే లైన్ పనుల్లో జాప్యం కావడానికి భూసేకరణ సమస్యే కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ రైల్వే స్టేషన్ తో పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నా భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లైన్, ఆర్వోబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల పూర్తి..
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027నాటికి పూర్తవుతాయని బండి సంజయ్ అన్నారు. వచ్చే మార్చి నాటికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తవుతాయని, రూ.60కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జమ్మికుంట-ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణం కూడా అనేక కారణాలవల్ల జాప్యం జరిగిందని చెప్పారు. రానున్న మూడు నెలల్లో ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
అమృత్ భారత్ పథకం కింద…
అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఆ జాబితాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంపికైందని మంత్రి సంజయ్ అన్నారు. సేతు బంధన్ స్కీం కింద రూ.154 కోట్లతో చేపట్టిన కరీంనగర్ ఆర్వోబీ పనులను పరిశీలించాలని, పూర్తిగా కేంద్ర నిధులతోనే ఆర్వోబీని నిర్మిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించామన్నారు.