వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓయూ, కేయూలో అమలు
తేలికగా ఉపాధి పొందేలా విద్యావిధానం
పాఠ్యప్రణాళిక అభివృద్ధి సదస్సులో పాల్గొన్న
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్,
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, యూకే వర్సిటీ ప్రతినిధులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు వక్తలు తెలిపారు. ఈ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందుందని అభిప్రాయపడ్డారు. ‘అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి’ కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సు ప్రారంభ సమావేశం బుదవారం బేగంపేటలోని సెస్ కార్యాలయంలో జరిగింది. దక్షిణ భారత బ్రిటీష్ కౌన్సిల్, యూకేలోని బంగోర్, అబిరిస్టిత్ విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈమేరకు రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తొలి రోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని వాణిజ్య శాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్యప్రణాళిక అమల్లోకి రానుందని ప్రకటించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు రూపొందించేందుకు విద్యా మండలి కృషి చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో విదేశీ విశ్వవిద్యాలయాల తోడ్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సరికొత్త విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహకారం చేస్తుందన్నారు.
బట్టి విధానంతో ఉపయోగం ఉండదు: నవీన్ మిట్టల్
బట్టి విధానంతో పరీక్షలు రాయడం వల్ల ఉపయోగం ఉండదని కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. చదువు తర్వాత విద్యార్థులు తేలికగా ఉపాధిపొందేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీలు వాస్తవ విజ్ఞానానికి కొలమానం కావడంలేదని, ప్రస్తుత పరీక్ష విధానం విద్యార్థుల్లో దాగిఉన్న అసలైన ప్రతిభను వెలికి తీయడం లేదన్నారు. విద్యార్థుల్లో అనలిటికల్, క్రిటికల్ ఆలోచన విధానం కొరవడిందని, దీనివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ కొరవడుతోందని చెప్పారు. మారుతున్న కాలానికి పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పదునుపెడితే విభిన్న కోణంలో ఆలోచన విధానం మెరుగుపడుతుందని చెప్పారు. ఆ దిశగా బోధన విధానాన్ని మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా: వాకాటి కరుణ
యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా రాష్ట్ర ఉన్నత విద్యలో మార్పులు మంచి పరిణామమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. నైపుణ్యవంతమైన విద్యను యూజీ స్థాయి నుంచి అందిచగలమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో సామాజిక విశ్లేషాత్మక విద్యకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనాత్మక విద్యాబోధన దిశగా సాగుతున్న ప్రయత్నానికి అన్ని విధాల సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ రవీందర్, బంగోర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జనకపుష్పనాథన్, బ్రిటీష్ కౌన్సిల్‌కు చెందిన ప్రొఫెసర్ ఉషాకిరణ్, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, విద్యామండలి కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.