Friday, November 22, 2024

KTR: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచార‌ణ‌ వాయిదా..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావలసిన మంత్రి కొండా సురేఖపైన వేసిన ప‌రువున‌ష్టం కేసు విచార‌ణ బుధవారానికి వాయిదా పడింది. గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించార‌ని కేటీఆర్ ఈ నెల 3వ తేదీన నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు దాన్ని ఈ నెల‌ 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను ఆరోజు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. అలాగే ఈ కేసులో కేటీఆర్ తరపు న్యాయవాది 23 రకాల ఆధారాలను కోర్టులో స‌మర్పించారు.

విచార‌ణ వాయిదా వేసిన కోర్టు
ఈ కేసులో కేటీఆర్‌తో పాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్‌ వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు మేజిస్ట్రేట్ శ్రీదేవి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన విచార‌ణ బుధవారానికి వాయిదా వేస్తున్న‌ట్లు న్యాయమూర్తి ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement