హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13కు ఇన్‌చార్జి జడ్జి వాయిదా వేశారు. ఈ కేసులో బుధవారం తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను నమోదుచేయాల్సి ఉన్నది. ఇప్పటికే కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను రికార్డు చేసిన విషయం తెలిసిందే.
తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు రాతపూర్వంగా కమర్పించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను అందించారు.
కాగా, సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వివరణ వాయిదా పడింది. ఈ కేసులో మంత్రి కొండా సురేఖ తన వాగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే జడ్జి సెలవులో ఉండటంతో వచ్చే నెల 13కు పోస్ట్‌పోన్ అయింది.