దీపావళి సందర్భంగా సొంత ఊళ్లకు వెళుతున్న ప్రజలు
వరుస సెలవులతో కుటుంబాలతో సహా ప్రయాణం
మూడు నెలల ముందే రైల్వే టికెట్ల బుకింగ్
ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు పెరిగిన రద్దీ
దీపావళి సందర్భంగా ఆంధ్రకు వెళుతున్న ప్రజలు
జనరల్ బోగిలో ప్రయాణానికి క్యూలైన్లు
తోపులాట లేకుండా చర్యలు చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే అధికారులు
దీపావళి, నాగుల చవితి పండగలను గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తు ఉంటారు. ఈ సారి దీపావళితోపాటు మూడు రోజులు సెలవులు కావడంతో హైదరాబాద్ మహ నగరంలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. శుక్రవారం, సోమవారం సెలవు పెట్టగలిగితే దీపావళితోపాటు నాగుల చవితి పండగ చూసుకుని తిరుగు ప్రయాణం కావొచ్చని ఈ ఏడాది అధిక సంఖ్యలో సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. అలాగే దసరాకు సొంత ఊళ్లకు వెళ్లని వారు ఇప్పుడు వెళుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీగా మారాయి.
మూడునెలల ముందే…
హైదరాబాద్ నుంచి పాట్న, కోల్‌కతా, వారణాసి, దానాపూర్, ఢిల్లీ, రాయపూర్, బిలాస్‌పూర్, టాటానగర్, ఖర్గపూర్, భువనేశ్వర్‌తోపాటు ఉత్తరాంధ్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస తదితర ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు మూడు నెలల ముందే టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారు. ప్రధానంగా దానాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, కోణార్క్, విశాఖ, గౌహతి, ఈస్ట్ కోస్టు, గోదావరి, గరీభ్, దురంతో తదితర రైళ్లలో నెల రోజుల క్రితమే రిజర్వేషన్‌లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ సైతం వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు అనివార్యంగా జనరల్ బోగీలపై ఆధారపడాల్సి వస్తోంది.
సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా….
రైళ్ల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో తోపులాట ఉండకుండా నివారణ చర్యలు చేపట్టారు. జనరల్ బోగీ టికెట్ తీసుకున్న ప్రయాణికులకు క్యూలైన్ ద్వారా రైలు ఎక్కేలా అధికారులు చర్యలుతీసుకున్నారు. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో ఈ ఏడాది ప్రారంభించారు. ఇది విజయవంతం అయితే ఇదే పద్ధతిని అవలంభిస్తారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన అన్ని రైళ్లకు క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
నాంపల్లి, కాచిగూడ…
సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి (హైదరాబాద్) , కాచిగూడ, లింగపల్లి రైల్వే స్టేషన్‌లు ప్రయాణికుల రద్దీతో నెలకొంది.మహా నగరంలో ఉంటున్న వివిధ ప్రయాణికులు తాము రిజర్వేషన్ చేయించుకున్న రైళ్లు ఎక్కడానికి ఆయా స్టేషన్లు చేరుకుంటున్నారు. దీంతో అన్ని స్టేషన్లు రద్దీగా మారాయి.
జనరల్ బోగీలు పెంచాలి…
జనరల్ బోగీల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వరకు 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు , కొన్నింటిలో మాత్రం 3 నుంచి 4 సాధారణ బోగీలు ఉన్నాయి. అయినప్పటికీ అందుకు ఐదు రెట్ల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. భార్యాపిల్లలతో సహా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలి వచ్చిన ప్రయాణికులు చివరకు జనరల్ బోగీల్లో కూడా వెళ్లేందుకు అవకాశం లేక స్టేషన్ బయటపడిగాపులు కాస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. పండగా సీజన్‌లో 30 వేల మందికి పైగా సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా.
బస్సులు కూడా రద్దీ
మహాత్మ గాంధీ బస్టేషన్ రద్దీగా ఉంది. ఇక్కడ నుంచి తెలంగాణ, ఏపీలకు ఇటు టీజీ ఆర్‌టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నాయి. కొందరు ముందస్తుగా టికెట్ తీసుకోగా… మరి కొందరు అప్పటికప్పుడు టికెట్లు తీసుకుంటున్నారు. ఇసుకపోస్తే రాలనంతగా బస్టేషన్ లో ప్రయాణికులు ఉన్నారు.
ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
ప్రైవేటు బస్సులను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. దీంతో బీహెచ్ఈఎల్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట, లకడీకపూల్, నాంపల్లి, సీబీఎస్, మహాత్మాగాంధీ బస్టేషన్, దిల్‌షుక్‌నగర్, ఎల్.బి.నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బస్సుల కోసం వచ్చే ప్రయాణికులతో ఆయా ప్రాంతాలు రద్దీగా ఉన్నాయి.