నగరంలో ఎంఎంటీఎస్‌కు ఆదరణ తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా ముందు కళకళలాడిన రైళ్లు.. మళ్లి పట్టాలెక్కి ఆరు నెలలు దాటినా ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కరోనాకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 121 సర్వీసులు రాకపోకలు సాగించేవి. సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకునే వారు. హైదరాబాద్‌లో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థలో తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేర్చేదిగా పేరుగాంచిన ఎంఎంటీఎస్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో పలు సందర్భాలలో రైళ్ళు రద్దు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఒక ఏడాదికి పైగా ఎంఎంటీఎస్ రైళ్ళకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాలకు అవకాశం కల్పించినప్పటికి ఒక్క ఎంఎంటీఎస్ నిర్వహణకు చాలా రోజుల వరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నివ్వలేదు. దీంతో రెగ్యులర్ ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు.
ఎంఎంటీఎస్ చివరకు దశల వారీగా పునరుద్దరించినప్పటికి ప్రయాణికుల నుంచి ఆశించిన ఆదరణ లభించకపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఉదయం, సాయంత్రం కొంత మేర ప్రయాణికుల రద్దీ ఉంటుంది. మిగతా సమయంలో ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ సర్వీస్‌లు ఖాళీగా నడపాల్సి వస్తుందని రైల్వే అధికారులు అంటుంన్నారు.
50శాతం దాటని ఆక్యూపెన్సీ..
సికింద్రాబాద్ – లింగంపల్లి, ఫలక్ నుమా – లింగంపల్లి, నాంపల్లి – ఫలక్ నుమా మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. కానీ ప్రయాణికుల ఆక్యూపెన్సీ 50శాతం కూడా దాటడం లేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో 50 నుంచి 70 శాతం ఆక్యూపెన్సీ ఉంటున్నప్పటికి మిగతా సమయాలలో 50 శాతం లోపే ఉంటుందని, కొన్ని సమయాలలో మరి తక్కువగా ఉండడంతో కొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వస్తుందని రైల్వే అధికారులు పేర్కోంటున్నారు. ప్రజా రవాణాలో తక్కువ ఖర్చుతో నడిచే ఎంఎంటీఎస్ పట్ల ప్రయాణికుల ఆదరణ లేక పోవడంతో రైల్వే అధికా రుల్లో ఆందోళన కలిగిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..