రామగిరి, (ప్రభన్యూస్): సింగరేణి భూనిర్వాసిత గ్రామమైన లద్నాపూర్ వాసుల ఆర్ అండ్ ఆర్ సమస్యపై బోర్డ్ మీటింగ్ ఏర్పాటు- చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్లు సింగరేణి అధికారులను కోరారు. శుక్రవారం డీజీఎంఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, సింగరేణి డైరెక్టర్లు బలరాం నాయక్, చంద్రశేఖర్, సత్యనారాయణలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో లద్నాపూర్ భూనిర్వాసితులతో కలిసి వారు మాట్లాడారు. సంస్థ మనుగడ కోసం తమ సర్వస్వం కోల్పోతున్న భూనిర్వాసితులను అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత సింగరేణి సంస్థపై ఉందని, మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించాలని కోరారు.
గ్రామంలో నిర్వాసితులను రెండుగా విభజించి 721 మందికి ఒక న్యాయం, 283 మందికి ఒక న్యాయం తగదని హితువు పలికారు. సంస్థ మనుగడ నిర్వాసితుల సమస్యల పరిష్కారం రెండు తమకు ముఖ్యమేనని, అధికారులు వ్యక్తిగత భేషాజాలకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకొవాలన్నారు. సత్వరమే నిర్ణయానికి రావాలని, నిర్వాసితులకు అన్యాయం జరిగితే తాము ముందుండి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్జీ-1, 2, 3 జీఎంలు నారాయణ, టీ-వీ రావ్, మనోహర్, నాయకులు జక్కు రాకేష్, పూదరి సత్యనారాయణ గౌడ్, దాసరి రాజలింగు, మేడగోని రాజన్న, బడికల శ్రీనివాస్, కనవేన శ్రీనివాస్, పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, బోల్లేపల్లి శంకర్ గౌడ్, వనం రాంచందర్ రావ్, భార్గవ్, నరివెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.