తెలంగాణలోని మహబుబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. మరిపెడ పోలీసు స్టేషన్లో సెకండ్ ఎస్ఐగా ఉన్న భిక్షపతిని మృత్యువు వెంటాడింది. మొన్న మానుకోట నుంచి ఇంటికి బైకుపై వెళ్తుంటే బర్రె ఢీకొనగా హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవ్వాల హైదరాబాద్ వెళ్లి ఇంటికొచ్చి మానుకోటకు వెళ్తుంటే అదే దారిలో మరోసారి యాక్సిడెంట్‌కు గురయ్యారు. కారులో వెళ్తుండగా టైరు బ్లాస్ట్ కావడంతో పక్కకు దూసుకెళ్లి యాక్సిడెంట్‌కు గురయ్యారు. దీంతో గాయపడ్డ ఎస్సై భిక్షపతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు.
మరిపెడ (ప్రభ న్యూస్): రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. మరిపెడ పి ఎస్ లో సెకండ్ ఎస్ఐగా రామటెంక భిక్షపతి(59) మరిపెడ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తుండగా కారు ముందు కుడి పక్క టైరు పేలింది. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ భిక్షపతిని స్థానిక పోలీసులు హుటాహుటిన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా నాలుగు రోజుల క్రితం ఇదే దారిలో విధులు ముగించుకొని మానుకోటలోని ఇంటికి బైకు పై వెళ్తుండగా లచ్చ తండా వద్ద బైకు గేదెను ఢీకొని గాయపడ్డారు. స్వల్ప గాయాలు కాగా నేడు హైదరాబాద్ ఆస్పత్రిలో చెకప్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మరో మారు ప్రమాదానికి గురై మృతి చెందారు.