తాండూరు రూరల్ : గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం సంగెంకలాన్‌లో వాగులో గల్లంతు అయిన పెంటప్ప మృతదేహంగా లభ్యమయ్యాడు. మూడో రోజు ఆదివారం ఉదయం అతని ఆచూకీ లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగెంకలాన్ గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలో షాపూర్‌లో బందువులతో కలిసి అంత్యక్రియలకు వెళ్లాడు. అదేరోజు రాత్రి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామ సమీపంలోని బండల వాగు భారీ వర్షానికి ఉదృతంగా ప్రవహించింది. గ్రామస్తులు వారించినా కూడా పెంటప్ప వాగును దాటే ప్రయత్నం చేసి గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అదేరోజు రాత్రి అర్దరాత్రి వరకు గాలింపు చేపట్టారు.
మరుసటి రోజు పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన ఆచూకీ లభించలేదు. మూడో రోజు ఆదివారం ఉదయం బండల వాగులోని బస్వరాజ్ పటేల్ పొలం సమీపంలో పెంటప్ప మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు, గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు. మృతదేహాన్ని వాగులోకి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరుపేద పెంటప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామసర్పంచ్ మేఘనాథ్ గౌడ్, గ్రామస్తులు కోరుతున్నారు. పెంటప్ప మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి.