ప్రభన్యూస్ ఉమ్మడిరంగారెడ్డి : డీసీఎంఎస్‌లో లాభాలు కొనసాగుతున్నాయి. ఈసారి రూ. 200కోట్లమేర ఆదాయం సమకూరింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీఎంఎస్‌కు ఆస్థులు ఉన్నాయి. దీంతో ప్రతి సంవత్సరం దండిగా ఆదాయం సమకూరుతోంది. దాంతోపాటు ధాన్యం కొనుగోలు విషయంలో డీసీఎంఎస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన 36వ సర్వసభ్య సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారిగీతారెడ్డి, డైరెక్టర్లు హాజరయ్యారు. దండిగా ఆదాయం సమకూరుతుండటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. సహకార సంఘాల చైర్మన్ల వేతనాలు పెంచడం పట్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
గతంలో సహకార సంఘాల చైర్మన్లకు కేవలం రూ. 1250 వేతనం మాత్రమే ఉండేది. దీనిని పెంచుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. రూ. 5కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న సంఘాల చైర్మన్లకు రూ. 7500 వేతనం…రూ. 10కోట్ల వరకు ఉన్న సంఘాలకు రూ. 10వేలు, రూ. 15కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించే సంఘాల చైర్మన్లకు రూ. 15వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని సంఘాల మినహా మెజార్టీ సంఘాల్లో పెద్దఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. చైర్మన్ల వేతనాలు పెంచినందుకు డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..