దావోస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్పర్యటనలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గత రాత్రి జరిగిన వివిధ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. దీంతో అమెజాన్, ఇన్ఫోసిస్, జెఎస్ డబ్ల్యు సంస్థలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్తో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఈ సంస్థ డేటా సెంటర్లను విస్తరించనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అమెజాన్ కు భూములు కేటాయించనుంది. అమెజాన్ ఏకంగా రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెడుతుండటం పట్ల రేవంత్ హర్షం వ్యక్తం చేశారు..
పోచారంలో ఇన్ఫోసిస్ ఐటి క్యాంపస్ విస్తరణ…
హైదరాబాద్‌లోని పోచారంలో ఇన్ఫోసిస్ ఐటి క్యాంపస్ విస్తరణకు నిర్ణయించింది.. ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్ రాజ్కా , ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేడు దీనిపై చర్చలు జరిగాయి.. అనంతరం ఐటి క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ ఓకే చెప్పింది.. దీంతో పోచారం క్యాంపస్‌లో అదనంగా 17,000 మంది ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే పోచారంలో ఉన్న కార్యాలయంలో 35,000 మందికి పైగా ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు..ఇక రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాలతో కూడిన తొలి దశ నిర్మాణం వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఆ కంపెనీ సిఎఫ్ వో వెల్లడించారు.
మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ … జెఎస్ డబ్ల్యు .
తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ను స్థాపించనున్నట్టు జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ ను నెలకొల్పనుంది. రూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు జేఎస్ డబ్ల్యూతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సంస్థతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఒప్పందంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ… రక్షణ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని చెప్పారు.