Friday, November 22, 2024

రేవంత్ రాకతో కేసీఆర్ వెన్నులో వణుకు

కొత్త టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాకతో కేసీఆర్ వెన్నులో వణుకుమొదలైయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. లక్షలాది ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులతో జరిగిన టీపీసీసీ ప్రమాణస్వీకారం టీఆర్ఎస్ పతనానికి తొలిమెట్టు అని పేర్కొన్నారు. ప్రగతి భవన్ కోట గోడలు కూలుతున్నాయని, భయంతో దిక్కు తోచని కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాని మండిపడ్డారు. సామజిక, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావాలనే లక్ష్యంతో ప్రమాణస్వీకారానికి ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు. మార్పు కోసం, కేసీఆర్ దొర గడి కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంటే కేసీఆర్ పాలెగాళ్ళు లెక్క పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ర్యాలీ కోసం రాజ్యంగ బద్ధంగా అప్లీకేషన్ పెట్టుకున్నా.. కుట్ర పూరితంగా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. దొంగ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పోలీసులు పాలెగాళ్ళలా వ్యవహరించడం మానుకోవాలన్నారు. మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాది రెడ్డి, మైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్,  గొంగిడి సునీత, మహిపాల్ రెడ్డి ఇలా టీఆర్ఎస్ నాయకులు అక్రమాల్లో గిన్నిస్ రికార్డ్ సాధించారన్నారు. పోలీసులకు దమ్ముంటే వీరిపై కేసు పెట్టాలని సవాల్ విసిరారు. ట్రాఫిక్ నిబంధనలు మాట్లాడుతున్న పోలీసులు… కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫాం హౌస్ వెళ్లడాని గంట ముందే మొత్తం ట్రాఫిక్ ని నిలిపేస్తున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో పెళ్లికి యాబై మంది కంటే ఎక్కువ వద్దని రూల్ పెట్టారు. మరి వాసాలమర్రిలో ఐదు వేలమందితో కేసీఆర్ సహపంక్తి  భోజనం చేస్తే … డిజీపీ కేసు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. రానున్న రెండున్నరేళ్లపాటు మరో యుద్దానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ దొర గడిని కూల్చేస్తామన్నారు. టీఆర్ఎస్ బానిస సంకెళ్ళ నుంచి తెలంగాణని విముక్తి చేయడానికి, అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతామన్నారు.

”ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలోని కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్య ప్రభుత్వాలు ఇంత కుట్రగా వ్యవహరించి వుంటే కేసీఆర్ ఇంటి గడప దాటేవారా?  కేటీఆర్ అడుగు బయటపెట్టేవాడా ? మిలియన్ మార్చ్, వంటావార్పు, రైల్ రోకో, రహదారి దిగ్బంధన .. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం లేకపోతే జరిగేవా ? ఈనాడు ఒక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా తిరిగి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలనుకోవడం ఎంతవరకూ న్యాయం” అని నిలదీశారు దాసోజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement