ఓట్ల కోసం మాయ మాటలు చెబుతున్న వారంటీ లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాల పాలవుతారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. గురువారం నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం లాలపల్లిలో గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతరం మాట్లాడుతూ 50 ఏళ్లుపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందన్నారు. ఓట్ల కోసం దొంగ హామీలు, 6 గ్యారంటీలు 60 గ్యారంటీలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4000 రూపాయల పింఛన్ వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న బిసి బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను అక్కడ అమలు చేయాలన్నారు. 45 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపికి మరోసారి గుణపాఠం చెప్పాలన్నారు. గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ గెలవడం ఖాయమని, పెద్దపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.