Saturday, November 23, 2024

రేపు మధ్యాహ్నం నుంచే యాదాద్రిలో ద‌ర్శ‌నాలు.. సామాన్య భక్తులు గ‌ర్భగుడిలోకి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాదాద్రి స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని గర్భగుడిలో దర్శించుకుందామన్న భక్తుల కోరిక కొన్ని గంటల్లో నెరవేరనుంది. ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి పునర్‌నిర్మించిన ఆలయ గర్భగుడిలో సామాన్య భక్తులకు యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు, సామాన్య భక్తులను దర్శనానికి అనుమతి తదితర అంశాలపై దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో శనివారం యాదాద్రిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 21న యాదాద్రి ఆలయ మహా ఉద్ఘాటన కార్యక్రమం ప్రారంభైందని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకల్లా మహాకుంభ సంప్రోక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మహా పూర్ణాహుితితో పూెజా కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు మహా కుంభ సంప్రోక్షణ యాగంతో మహా క్రతువు ముగుస్తుందన్నారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లు సతీసమేతంగా హాజరుకానున్నారని చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై జిల్లా పోలీసులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సానిక ఎమ్మెల్యేలతో అన్ని రకాలుగా చర్చించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

సీఎం కృషితో ప్రపంచ చరిత్ర కాబోతున్న యాదాద్రి…

సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో అయిదేళ్లకు పైగా శ్రమించి, అనేకసార్లు పనులను పరిశీలించి… ఎన్నోసార్లు సందర్శించారని.. ఆయన కృతితో యాదాద్రి ప్రపంచంలో చరిత్ర కాబోతోందని చెప్పారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరని ఆలయంగా యాదాద్రి నిల వబోతోందన్నారు. చరిత్రలో రాజులు, మహారాజులకు సాటిగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ తిరుపతిగా యాదాద్రి ప్రసిద్ధి చెందేలా ఆలయాన్ని పునర్‌నిర్మించారని కొనియాడారు. చాలా అద్భుతంగా యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం జరిగిందన్నారు. పునర్‌నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయానికి వచ్చేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అతిథులు సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని విన్నవించారు.
శోభాయాత్ర ద్వారా గర్భగుడికి స్వామివారు: ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి స్వయంభువును గర్భగుడిలో ప్రతిష్టించేందుకు ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగాలు ఆదివారం రోజు పూర్ణాహుతి తో ముగుస్తాయన్నారు. ఆ తర్వాత బాలాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులను శోభాయాత్ర ద్వారా గర్భగుడిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనననున్నారని చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణ ను విజయవంతంగా పూర్తిచేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించామని, ఎవరెవరూ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి..?, వీఐపీలకు అనుకూల సౌకర్యాలు, భోజన వసతులు తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం దేవాలయ నిర్మాణంలో అంకితమై పనిచేసిన శిల్పులను సీఎం కేసీఆర్‌ సన్మానించనున్నట్లు చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో నే వారికి సన్మానం అయ్యాక… భోజన విరామ సమయం నుంచి భక్తులను గుట్టపైకి అనుమతిస్తామని చెప్పారు. సామాన్య భక్తులు ఆదివారం సా. 3 గంటల తర్వాతనే గుట్టపైకి రావాలని కోరారు. ఒక ఘాట్‌ రోడ్డును గుట్ట పైకి, మరొకటి కిందకు వెళ్లేందుకు అనుమతించినట్లు వివరించారు.


ఆదివారం మధ్యాహ్నం తర్వాతే గుట్టపైకి రావాలి.. భక్తులకు ఆలయ ఈవో గీత వినతి

- Advertisement -

గర్భగుడిలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఆదివారం నుంచి పున: ప్రారంభమవుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు. భక్తులు ఆదివారం ఉదయమే గుట్టకు వచ్చి ఇబ్బందులు పడొద్దని కోరారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అందరికీ స్వయంభువు దర్శనం… ఇక వెయ్యేళ్లపాటు లభిస్తుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఇక వెయ్యేళ్లపాటు దర్శించుకోవచ్చని భక్తులు సూచించారు.

సుదీర్ఘ సమీక్ష…

ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు సుదీర్ఘంగా సమీక్షించారు. పూజలు, ఉత్సవాలకు ఏర్పాట్లు, ప్రోటోకాల్‌ అరేంజ్‌మెంట్స్‌, అతిథులు విడిది చేసేందుకు గదుల కేటాయింపు, నీటి, భోజన, విద్యుత్‌ సౌకర్యం, బందోబస్తు, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు, అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం యాగశాలలో విఐపీల కోసం భోజన, వసతి, విడిది గృహలు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, అదనపు సీపీ సుధీర్‌బాబు, కలెక్టర్‌ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement