- రాహుల్ జీ… ఆ ఆరింటిపై పెదవి విప్పండి
- కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీత
- తెలంగాణలో పర్యటించాలంటే వాటిపై స్పందించాల్సింది
- 15వేల కోట్ల మూసికి లక్షన్నర కోట్లా
- ఇది దోపిడి కాక మరేమిటంటూ ప్రశ్న
- ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి..
- కేసీఆర్‌ను మించిపోయిన కాంగ్రెస్ గొప్పలు
- అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం
- ఆలయాలపై వరుస దాడులు.. సీఎం నోరు విప్పరేం..
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి
రుద్రంగి, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): రాష్ట్రానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి దమ్ముంటే.. తెలంగాణలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై స్పందించాలని కేంద్ర హొశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎంపీ ల్యాడ్స్, ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ దేశమంతా పాదయాత్ర చేశానని చెప్పుకున్న రాహుల్ గాంధీకి ధైర్యముంటే 6 గ్యారంటీలపై తెలంగాణలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
ఎన్నికల హామీలతో కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట్రలోనూ దొంగ హామీలు, అబద్దాలతో ఓట్లు- దండుకోవాలని చూస్తోందన్నారు. తెలంగాణలో రుణమాఫీ చేసినట్లుగా, 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లుగా, ఎంతో అభివృద్ధి చేసినట్లు-గా గొప్పలు చెప్పుకుంటూ మహారాష్ట్రలో పేపర్లకు యాడ్స్ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. గతంలో కేసీఆర్ ఇట్లనే తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర, పంజాబ్‌లకు పంచారని, కాంగ్రెస్ నేతలు ఆయనను మించిపోయారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని హమీ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకిచ్చిన హామీలపై సమాధానం చెప్పిన తరువాతే రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర చేసేందుకు సిద్ధం కావడంపై స్పందించిన బండి తాను చేసిన పాదయాత్రలో మూసీ వద్దకు వెళ్లి విషం కక్కుతున్న నీళ్లను కళ్లారా చూసినట్లు తెలిపారు. విషపు నీటి కోరల్లో చిక్కుకుని యాదాద్రి జిల్లా ప్రజలు ఏ విధంగా విలవిల్లాడుతున్నారో… సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగు నీటి కోసం నీళ్లు కొనుక్కొని, వాటర్ ప్లాంట్ ద్వారా తెచ్చుకునేందుకు పడిన బాధలు చూశానని గుర్తు చేశారు. మూసీని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుండి కోరుతోంది. కానీ ఆ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దని డిమాండ్ చేశారు.
అలాగే మూసీని అడ్డుపెట్టు-కుని లక్షన్నర కోట్ల దోపిడీని ఆపాలన్నారు. 15 వేల కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లకు పెంచి కవిషన్లు దండుకోవడానికి మేం వ్యతిరేకమన్నారు. తెలంగాణ నిండా అప్పుల్లో మునిగిపోయిందని, బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తోందని మంత్రులే మొత్తుకుంటున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, జీతాలకే ఇబ్బందిగా ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు మళ్లీ లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంత వరకు కరక్టన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటు-ంబం లక్ష కోట్లు- దోచుకుంటే… మీరు లక్షన్నర కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా..? అంటూ మండిపడ్డారు.
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్కడ అన్ని పత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, రుణమాఫీ చేసినమని ఊదరగొడుతూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ కూడా ఇలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిండని, పంజాబ్ రైతులకు పప్పు బెల్లంలా పంచిండని గుర్తు చేశారు. తెలంగాణ రైతులను అరిగోస పెట్టిన కేసీఆర్‌ణు మించి కాంగ్రెస్ పాలనలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఒకవైపు ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతూ ఇంకోవైపు మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ పైసలను వాడుకునేందుకు సిగ్గుండాలన్నారు.
6 గ్యారంటీల అమలు కాలేదని, రుణమాఫీ పూర్తి కాలేదని, ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటించాడన్నారు. కానీ మహారాష్ట్రలో మాత్రం రుణమాఫీ చేసినట్లుగా, 6 గ్యారంటీ-లను అమలు చేస్తున్నట్లుగా గొప్పలు చెబుతున్నారన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లుగానే ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతుందన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ మోసాలను గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాస్ రావులు పాల్గొన్నారు.