Monday, November 25, 2024

Dangerous Day – వేర్వేరు యాక్సిడెంట్ల‌లో న‌లుగురి మృతి

25 మందికి గాయాలు
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఒకరి మృతి
రాజేంద్రనగర్‌ ఓఆర్‌ఆర్‌పై డాక్టర్ మృతి
మెడ్చ‌ల్‌లో ఒక‌రి మృతి
సిరిసిల్ల జిల్లాలో విద్యార్థిని మృతి
జ‌న‌గామ‌లో టైర్ పేలి బ‌స్సు బోల్తా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూస్‌నెట్ వ‌ర్క్: ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఒక‌చోట రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం జ‌రిగిన ప‌లు రోడ్డు ప్ర‌మాదాల్లో న‌లుగురు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్ లోని మాస‌బ్ ట్యాంక్ ప్లై ఓవ‌ర్ వ‌ద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన క్యాబ్ డివైడ‌ర్ ను ఢీకొన‌డంతో ఒక‌రు మృతి చెంద‌గా న‌లుగురు గాయ‌ప‌డ్డారు. రాజేంద్ర‌న‌గ‌ర్ స‌మీపాన ఓఆర్ ఆర్ లో కారు డివైడ‌ర్‌కు ఢీకొని డాక్ట‌ర్ మృతి చెందారు. మేడ్చ‌ల్‌లో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జ‌రిగిన ప్ర‌మాదంలో న‌ర్స‌రీ విద్యార్థిని మృతి చెందింది. జ‌న‌గామ జిల్లాలో బ‌స్సు టైర్ పేలి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 20 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

- Advertisement -

మాస‌బ్ ట్యాంక్ వ‌ద్ద‌…
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన క్యాబ్.. డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్యాబ్ ముందు సీటులో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్యాబ్ లో ఉద్యోగులను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. సాయితేజ మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రాజేంద్ర‌న‌గ‌ర్ వ‌ద్ద‌…
రాజేంద్రనగర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఎల్‌వి ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రిలో కంటి వైద్య‌నిపుణుడుగా ప‌నిచేస్తున్న నీల‌య రెడ్డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మేడ్చ‌ల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో…
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెంది గా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. జగద్గిరిగుట్ట కు చెందిన మజ్జి శ్రీకాంత్, మున్నూరు నరేష్ తమ ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు వెళ్తుండగా మేడ్చల్ మునిసిపాలిటీ ఆత్వెల్లి మసీదు వద్ద డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన నరేష్ ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

నిర్ల‌క్ష్యానికి చిన్నారి బ‌లి
సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలో మ‌హ‌ర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవ‌ర‌ణ‌లో బ‌స్సు ఢీకొట్ట‌డంతో మ‌నోజ్ఞ (3) అనే న‌ర్సరీ విద్యార్థిని మృతి చెందింది. సోమ‌వారం ఈ సంఘ‌ట‌న చూసిన ప‌లువురు హృద‌యాలు క‌లచివేసింది. విద్యార్థుల‌తో వ‌చ్చిన బ‌స్సు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోకి తీసుకువెళ్లే క్ర‌మంలో మ‌నోజ్ఞ ఢీకొని త‌ల‌పై వెళ్ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెదిరిన త‌ల్లిదండ్రుల క‌ల‌
ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన స‌ల్కం భూమయ్య, వెంకటవ్వల కుమార్తె సల్కం మనోజ్ఞ (3) బాగా చ‌దివించాల‌ని త‌ల్లిదండ్రులు క‌ల‌లుగ‌న్నారు. ఆ చిన్నారికి మంచి భ‌విష్య‌త్తు ఇవ్వ‌డం కోసం ముస్తాబాద్ మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చేర్పించారు. మ‌నోజ్ఞ‌ నర్సరీ చదువుతోంది. వెంకటవ్వ వ్యవసాయ పనులు చేస్తుండగా, వెంకటయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వారి కల చెదిరింది.

స్కూల్ ఆవ‌ర‌ణ‌లో విషాద‌ఛాయ‌లు
త‌మ కుమార్తె మనోజ్ఞ మృతి చెందిన విష‌యాన్ని స‌మాచారం అందిన వెంట‌నే తల్లిదండ్రులు. గ్రామస్తులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. పసిబిడ్డ ప్రాణం తీసిన పాఠశాల నిర్వాకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువుల రోదనలతో పాఠశాల ఆవరణ విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. నిర్లక్ష్యానికి కారణమైన వారిని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ బంధువులు పాఠశాల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

టైర్ పేలి బ‌స్సు బోల్తా
బెంగళూర్ నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జనగామ జిల్లాలో టైర్ పేలి బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 20 మందికి గాయాల‌య్యాయి. నిడిగొండ మధ్య జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో స్సీడ్ లో ఉన్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. అందులో ప్ర‌యాణం చేస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన‌ వారిని ఆస్పత్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement