ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ : విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వైరస్ సోకుతోంది. గతంలో కూడా అలాగే జరిగింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ ప్రభలుతున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చేవారికి పాజిటివ్ వస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మాత్రం విదేశాల నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈనెల 1వ తేదీ నుంచి విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తమయ్యారు. వీరికి ఆర్టీపీసీఆర్ చేసిన తరువాతే బయటకు పంపుతున్నారు. దాదాపుగా ఆరుగంటలపాటు విమానాశ్రయంలో వాళ్లు వేచి చూడాల్సిందే. దాదాపుగా 400 మంది టెస్టుల కోసం వేచి ఉండేలా సౌకర్యాలు కల్పించారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ చర్చనీయాంశంగా మారింది. యూకే నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన వారిలో యూకే నుంచి వచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే పదిమందికి పాజిటివ్ వచ్చింది. మొదటిరోజు ఒకరికి సోకగా తాజాగా యూకే నుంచి వచ్చిన వారిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితోపాటు సింగాపూర్, కెనడా, అమోరికా నుండి వచ్చిన ఒకొక్కరికి కూడా పాజిటివ్ వచ్చింది. వీరందరినీ గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. వీరికి డెల్టా సోకిందా ఒమిక్రాన్ సోకిందా అనే విషయం తేలేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుంది. పాజిటివ్ వచ్చిన వారి శాంపుల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్స్‌కు పంపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital