వాయికాలుష్యంలో ఢిల్లీ నగరంతో భాగ్యనగరం పోటీ పడనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.. అసలే శీతాకాలం…ఆపై లక్షల సంఖ్యలో వాహనాల రాకపోకలతో గాలిలో తేమ తగ్గి కాలుష్యం పెరిగిపోతున్నదని వస్తున్న నివేదికలు జంటనగర వాసులను కలవర పెడుతున్నది.. వాయు కాలుష్యం క్రమేపి పెరుగుతూ ఉండటంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం వల్ల మరి ముఖ్యంగా శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం స్ధాయి పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియా బారిన పడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి..
హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సనత్‌నగర్‌లో వాయు నాణ్యత ఆందోళనకరంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక నివేదిక ను వెల్లడించింది. ఇటీవల గాలి నాణ్యత సనత్‌నగర్‌లో 213 పాయింట్లు నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు. అదే సమయంలో జూ పార్కు వద్ద 162, హెచ్సీయూ 101, రామచంద్రపురం 77, మలక్‌పేట 55 పాయింట్లు నమోదయ్యాయి.రెండు, మూడు ప్రాంతాలు మినహా 50 నుంచి 170 పాయింట్ల వరకూ నమోదయ్యాయి. ఈ హైదరాబాద్ నగరం లో కొన్ని లక్షల వాహనాలు ఉన్నాయి. వాటి నుండి వచ్చే కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఇదే.. చలి పెరిగిపోవటంతో దుమ్ము, ధూళి, వాహనాల పొగ గాలిలో కలవడం లేదు. అది కేవలం పైన ఒక పొగలాగా పేరుకుపోతుంది. దీంతో, కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గుతూ వస్తుంది..
వాయు కాలుష్యం మానవుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్ధితులు దుర్భరంగా మారుతున్నాయి. దీంతో శ్వాస సంబంధిత వ్యాధుల కేసులు హైదరాబాద్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాలుష్యం ఢిల్లీని దాటే అవకాశాలున్నాయనడం లో ఎలాంటి సందేహం లేదు..