హైదరాబాద్, ప్రభన్యూస్ : హైదరాబాద్ నగర ప్రజలు ఎండల తీవ్రతకు అల్లాడుతున్నారు. భానుడి భగభగలకు జనం మలమల మాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు సైతం ఎండ వేడికి ఉపశమనాన్ని కలిగించలేకపోతున్నాయి. గత వారంరోజులుగా పెరుగుతున్న ఎండలు ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావడానికి జనం భయపడుతుండటంతో నగరంలోని రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 2015, 2016 ఏప్రిల్‌లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఈసారి రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకుంటుందన్న వార్తలు నగర వాసులను కలవరపెడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప నగర వాసులు మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రాడానికి ఇష్ట పడటం లేదు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు…
తరచూ మంచి నీరు తాగాలి.
ద్రవ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
షర్బత్, నిమ్మరసం , మజ్జిగ తాగాలి.
ఎండలో బయటకు వెళ్లడం తప్పని సరైతే గొడగు తీసుకెళ్లాలి.
ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి.
కాటన్ దుస్తులనే ఎక్కువగా వాడాలి.
వైద్యుల సూచనలు.
వేసవిలో పరిశుభ్రత చాలా అవసరం.
ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి.
మాంసాహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి.
వడదెబ్బ తాకినట్టు అనిపిస్తే ఓఆర్‌ఎస్ పాకెట్లను తాగాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..