మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో మూడున్నరేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దాదాపు వారం రోజుల తరువాత, రాచకొండ పోలీసులు ఆ నీచుడిని పట్టుకున్నారు. చిన్నారిపై ఘోరానికి ఒడిగట్టిన ఒడిశాకు చెందిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ (40) ను అరెస్ట్ చేశారు.
ఈ నెల 4న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అభిరామ్ దాస్.. శుక్రవారం(జులై 9) అదే ప్రాంతంలో మరో బాలిక (9) ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలోకూడా రికార్డయ్యాయి. దీంతో ఆదివారం నాటి నేరానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలతో పోల్చి చూడగా.. రెండు ఘటనల్లో నిందితుడు ఒకడేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. విచారణలో నిందితుడు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. జులై 4 సాయంత్రం మొదటి బాధితురాలిని కిడ్నాప్ చేసిన అభిరామ్.. చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, రాత్రి సమయంలో అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం ఆమెను దమ్మాయిగూడలోని వాటర్ ట్యాంక్ దగ్గర వదిలి పారిపోయాడు. బాలిక ఏడుపు గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికపై లైంగిక వేధింపులకు గురైందని వైద్య పరీక్షలో తేలింది. దీంతో నిందితుడి కోసం నాలుగు రోజులుగా గాలిస్తుండగా.. నాగారం అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: అంబాజీపేటలో అమానుషం.. దళిత మహిళల పై అగ్ర వర్ణాల దాడి