ఖమ్మం బ్యూరో (ప్రభ న్యూస్): తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో యూనిట్ల ఏర్పాటు కోసం దళిత బందు నిధులు విడుదలయ్యాయి. ఆ మేరకు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. చింతకాని మండలంలో దళితబంధు లబ్ధిదారులు యూనిట్ల గ్రౌండింగ్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు మంజూరు చేసి మొదటి విడతగా రూ.1లక్షా50వేలలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగాలలో యూనిట్లు గ్రౌండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు మొదటి విడతలో లక్షాయాబైవేల చొప్పున లబ్ధిదారుల ఖాతాలకు జమచేసినట్టు పేర్కొన్నారు. డైరీ యూనిట్ స్ధాపించుకునే వారు ముందుగా షెడ్ ఏర్పాటుచేసుకోవడానికి, అదే విధంగా పశుగ్రాసం పెంచుకునేందుకు భూమిలేని వారు కౌలు భూమి ఒప్పందం చేసుకోవడానికి, సెంట్రింగ్ యూనిట్లు గ్రౌండింగ్ చేసుకునే వారు మెటీరియల్ కొరకు అడ్వాన్సు చెల్లించి, అద్దె షాపులు లీజు ఒప్పందాలు చేసుకొని అవసరమైన కోటేషన్లు పొంది వివిధ యూనిట్ల గ్రౌండింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు లబ్ధిదారుల ఖాతాలకు మొదటి విడతగా నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ట్రాన్స్‌పోర్టు రంగానికి సంబంధించి ఎక్కువమంది లబ్ధిదారులు డిమాండ్ కంటె అధికంగా ఆసక్తి కనబర్చారని, ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు వంటి వాహనాలకై ఎక్కువమంది ఎంపిక చేసుకున్నారని తెలిపారు. లైసెన్స్ లేనివారు, ట్రాన్స్‌పోర్టు రంగంలో అనుభవం లేని లబ్ధిదారులు కూడా ట్రాన్స్‌పోర్టు రంగాలలో యూనిట్ల గ్రౌండింగ్‌కు ఎంపిక చేసుకున్నారని, వారికి ఆలోచన చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు యూనిట్ల లబ్ధిదారులకు ప్రస్తుతం లక్షా50వేలు జమచేయబడవని, వారి ఆలోచన మేరకు తిరిగి నిర్ణయం తీసుకున్న పిదప లక్షాయాభైవేల రూపాయలు ఖాతాలకు జమవుతాయని కలెక్టర్ తెలిపారు. చింతకాని మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల దళితబంధు మంజూరు చేయడం జరిగిందని, ఇట్టి విషయంలో ఎటువంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదని, మొదటి విడతగా యూనిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన ముందస్తు ఏర్పాట్లకు లబ్ధిదారులందరికి రూ.1.50లక్షలు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని గ్రౌండింగ్ పనులను బట్టి వారం రోజుల లోపు లబ్ధిదారుల ఖాతాకు జమచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.