ఆక్సిజన్ ఉన్నా సరఫరా చేయలేం
ప్రైవేట్ ఆస్పత్రులకు సమాధానమిస్తున్న ఏజెన్సీలు
సిలిండర్లు కొని ఇళ్లలో బ్లాక్ చేయడమే కారణమంటున్న ఆస్పత్రులు
హైదరాబాద్, : సెకండ్‌వేవ్‌లో ఒక్కసారిగా కొవిడ్ కేసులు పెరిగి ఆక్సిజన్ లభించక పలువురు పేషెంట్‌లు ప్రాణాలు వదలిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 10 రోజుల క్రితంతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత పెరిగి నప్పటికీ ప్రాణవాయువు సరఫరాకు సిలిండర్ల కొరత వేధి స్తోంది. సాధారణంగా రాజధాని హైదరాబాద్ నగరంలో కార్పొరేట్, చిన్న ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ కోసం బాలా నగర్, జీడిమెట్ల, మియాపూర్ ప్రాంతాల్లోని ప్రాణవాయువు ను సిలిండర్లలో సరఫరా చేసే ఏజెన్సీల మీద ఆధారపడు తుంటాయి. వారికి అవసరమైన పరిమాణంలో ఆక్సిజన్‌ను ఈ ఏజెన్సీలు రోజువారిగా
సిలిండర్లలో నింపి ఆస్పత్రులకు డెలివరీ చేస్తుంటాయి. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ఈ ఏజెన్సీలు తమ క్లైంట్లయిన ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేద్దామంటే ఖాళీ సిలిండర్లు దొరకకుండా పోయాయి. అసలు సిలిండర్ల కొరత ఎందుకు ఏర్పడిందా అని ఏజెన్సీలు ఆరాతీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా చాలా మంది హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్‌లు సిలిండర్లను కొనుగోలు చేసి ఆక్సిజన్ నింపుకొని ఇళ్లలోనే ఉంచుకుంటున్నట్లు వారి దృష్టికి వచ్చింది. దీంతో వారు ఇదే విషయాన్ని ఆయా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెప్పగా వారు పోలీసులకు ఈ విషయాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెన్సీలతో ఒప్పందం ఉంటుంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్పత్రులు వెంటిలేటర్ బెడ్‌ల సంఖ్య పెంచాయి. ఇందుకు తగ్గట్లుగా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిందిగా ఏజెన్సీలను అడిగితే సిలిండర్ల కొరత ఉందని సమాధానం వస్తోంది. ఆస్పత్రుల్లోనేమో చాలా మంది సీరియస్ కండీషన్‌లో ఉన్న పేషెంట్‌లకు ఆక్సిజన్ అందడం లేదు. హైదరాబాద్‌లో చాలా మంది సిలిండర్లను ఇళ్లలో పెట్టుకుని అవసరం ఉన్నా లేకున్నా ఆక్సిజన్‌ను పీల్చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని మేము పోలీసుల నోటీసుకు తీసుకెళ్లామని ఒక ప్రైవేటు ఆస్పత్రి మేనెజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఆక్సిజన్ హోల్‌సేల్ వ్యాపారం చేసే ఏజెన్సీలు తమ వద్ద ఒప్పందాలు పోను మిగిలిన ఆక్సిజన్‌ను ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికే ఇస్తున్నాయి. ఉదయం 11 తర్వాత ఆక్సిజన్ సిలిండరే దొరకడం లేదు. సాధారణ పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ.10వేలు ఉంటే ప్రస్తుతం ఏజెన్సీల వద్దకు వచ్చే వారు ఏకంగా రూ.50 వేల పెట్టి కొనడానికి సిద్ధంగా ఉంటున్నారు. దీంతో ఏజెన్సీలు ఎక్కువ ధర ఇచ్చే వారికి సిలిండర్లను ఇచ్చేయడంతో ఆస్పత్రులకు అధిక ఆక్సిజన్ సరఫరా చేయడంలో సమస్య తలెత్తుతోంది. రీఫిల్లింగ్ రూ.250 నుంచి పది రెట్లు పెరిగి రూ.2500 పలుకుతోందంటే పరిస్థితి అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ కోసం చిన్న ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి రోజుకు 10 నుంచి 15 ఫోన్‌లు పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నాడని మాకు వస్తున్నాయి. అయినా మేమేమీ చేయలేకపోతున్నామని ఒక ఆక్సిజన్ సరఫరా చేసే రీటెయిలర్ సిలిండర్ల కొరత సమస్యను వివరిస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లను కొని ఇళ్లలో ఉంచుకోవడం నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. ఆక్సిజన్ పూర్తిస్థాయిలో నింపిఉన్న సిలిండర్‌ను ఇంట్లో పెట్టుకోవడం ప్రమాదకరం అని దాని వాడకం సరిగా తెలియకపోతే అది పేలుతుందని వారు హెచ్చరిస్తున్నారు. నగరంలో ఉన్న అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటర్ బెడ్ కూడా ఖాళీగా లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వద్ద సిలిండర్లు ఉన్నా వాటిని స్వచ్ఛంధంగా మార్కెట్‌లో రొటేషన్‌కు ఇచ్చి వేయాలని లేదంటే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎవరెవరు ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లు హోర్డింగ్ చేశారన్న దానిపై ఇప్పటికే ట్రేస్ చేయడం ప్రారంభించామని వారు చెబుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సెకండ్ వేవ్ ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం చాలా వరకు మెరుగుపడిందని, రాష్ట్రంలో కావాల్సినంత ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఓ ప్రభుత్వ కొవిడ్ కేర్ ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. అయితే సిలిండర్లను కొని ఎవరి ఇళ్లలో వారు పెట్టుకుంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ అవసరం ఉన్న చోటికి దానిని తరలించడం రానున్న రోజుల్లో ఇబ్బందిగా మారుతుందని ఆయన పేర్కొంటున్నారు. సరైన సమయానికి ఆక్సిజన్ సరఫరా చేయకపోతే ఆస్పత్రుల్లో విలువైన ప్రాణాలు పోతాయన్న విషయాన్ని సిలిండర్లు బ్లాక్ చేస్తున్న వారు దృష్టిలో పెట్టుకుని వాటిని మార్కెట్లోకి తిరిగి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.