మిగ్ జాం తుఫాను ప్రభావంతో రాగల రెండురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మిగ్ జాం తుఫాను కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, వరద నివారణ చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.