హైదరాబాద్: హైదరాబాద్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలందరి ఫోన్ బయటే పెట్టారు. ఎవరి ఫోన్లను లోపలికి అనుమతించలేదు. ముందుగా సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలను రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా రెండ్రోజుల పాటు హైదారాబాద్‌లోనే ఉండనున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న నేతలకు తెలంగాణ కళారూపాలతో స్వాగతం పలికారు. కళాకారులతో ఎమ్మెల్యే సీతక్క నృత్యం చేశారు. మరోవైపు సమావేశాల్లో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు ఇప్పటికే తాజ్ హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ తాజ్ కృష్ణలో రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.