Friday, November 22, 2024

TS: అన్ని ప‌థ‌కాల‌లోనూ కోత‌లే… బీఆర్ఎస్ నేతలు

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విర్ర‌వీగే మాట‌లు మాని ప్ర‌జ‌ల హితం కోసం పని చేయాల‌ని కోరారు బిఆర్ఎస్ నేత‌లు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్ లో బిఆర్ఎస్ నేత‌లు కొప్పులు ఈశ్వ‌ర్, శ్రీనివాస్ గౌడ్ , లింగ‌య్య యాద‌వ్ లు నేడు మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆయన మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలన్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. కవిత అరెస్ట్ సహా పలు ఘటనలు తమ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా జరుగుతున్నాయని అన్నారు. అధికారంలో ఉన్నామని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణచివేత వల్లే నక్సల్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకు వచ్చాయన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం పుడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారు ఉన్నారని పేర్కొన్నారు.

ఆరుగ్యారంటీల అమ‌లులో రేవంత్ లో చిత్తశుద్ధి క‌నిపించ‌డం లేద‌న్నారు.. అమ‌లు చేస్తున్నామంటూ ఊక‌దంపుడు ఉపన్యాసాలే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మాత్రం అవి చేర‌డం లేద‌ని ఆరోపించారు. అన్ని ప‌థ‌కాల‌లోనూ కోత‌లు విధిస్తూ కోత‌ల ప్ర‌భుత్వంగా మారిందంటూ రేవంత్ పై విరుచుకుప‌డ్డారు.. ఇచ్చిన హామీల అమ‌లుపై దృష్టి పెట్టాల‌ని రేవంత్ కు సూచించారు.. మీరు గేట్లు ఎత్తినా వ‌చ్చేది తిరస్క‌రించిన అభ్య‌ర్ధులేన‌ని అన్నారు. కాగా, పార్టీ మారుతున్న వార్త‌ల‌పై మాజీ మంత్రి శ్రీనివాస‌రెడ్డి స్పందిస్తూ, పుట్టిన రోజు నాడు గుడికి వెళితే బిజెపిలో చేరిన‌ట్లేనా అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement