Monday, November 25, 2024

TS | మంత్రి సీతక్క మీటింగ్ లో కరెంట్ కట్..

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది. హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

సీతక్క మాట్లాడే సమయంలోనే అక్కడ కరెంట్‌ పోయింది. దీంతో సమావేశంలో పాల్గొన్న వారు కరెంటు కోతలపైనే చర్చించుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంటు కోతలు పెరిగాయని చెప్పుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు కరెంట్‌ పోవడంతో మంత్రి సీతక్క అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా చివర్లో కరెంట్‌ రావడంతో అందరూ చప్పట్లు కొట్టారు.

కాగా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున మంత్రి సీతక్కకు నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన వారే కాకుండా కేసులు నమోదుకాని వారు ఎంతో మంది ఉన్నారని, వీరిని ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. ఉద్యమకారుల వేదిక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement