Friday, October 18, 2024

Cultural Feast – తెలంగాణ ఉద్యమానికి అలయ్ బ‌ల‌య్ స్పూర్తి – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. , ఒకప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల పరంగానే కార్యక్రమాలుండేవని, కానీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అన్ని పార్టీలను ఒకే గొడుగుపైకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అని అన్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన ‘అలయ్‌ బలయ్ కార్య‌క్ర‌మాన్ని నేడు నిర్వహించారు. ముందుగా దత్తాత్రేయ ఢంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత విశిష్ట అతిథిగా పాల్గొన్న రేవంత్ ప్ర‌సంగిస్తూ, అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నుంచి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి వారసత్వంగా తీసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంప్రదాయం తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని కొనియాడారు. దీన్ని నిలబెట్టుకోవాలన్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా అందరం ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

హాజ‌రైన అతిరథ మ‌హ‌ర‌థులు ….

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయశంకర్, గుర్మిత్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిఆర్ఎస్ మాజీ ఎంపి వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి , సిపిఐ ఎమ్మెల్యే కూన‌మ‌నేని సాంబ‌శివ‌రావు, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగ‌ర‌రావు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వి హ‌నుమంతురావు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్​ కుమార్​, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆక‌ట్టుకున్న సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

కాగా ఈ అల‌య్ బ‌ల‌య్ లో ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల విన్యాసాలు, హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక బృందాలతో స్వాగతం పలికారు. ఇక తెలంగాణ సంప్రదాయ వంటలతో అతిథుల‌కు, ఈ కార్య‌క్రమానికి హాజ‌రైన ప్ర‌జ‌ల‌కు విందు భోజనం వ‌డ్డించారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి అనేక తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement