Tuesday, September 17, 2024

TG: ఆధునిక పద్ధతులతో సేద్యం చేయాలి… గుత్తా సుఖేందర్ రెడ్డి

ఆంధ‌స్మార్ట్ , నల్లగొండ ప్రతినిధి : ఆధునిక పద్ధతుల‌తో సేద్యం చేయడం ద్వారా అధిక లాభాలను సాధించవచ్చని మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో రైతుబడి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి షోను వారు ప్రారంభించారు.

కొత్త ప‌ద్ధ‌తుల్లో…
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… మారుతున్న‌కాల‌నికి అనుగుణంగా కొత్త పద్ధతులు అవ‌లంబించాల‌న్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే పంటల సాగుపై దృష్టి సారించాలని రైతుల‌కు సూచించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంటలపై దృష్టి సారించాలని కోరారు. ఆయిల్‌పామ్‌ పంట సాగును ప్రోత్సహించేందుకు ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలని కోరారు. అగ్రిషో లో ఏర్పాటుచేసిన స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగేలా కలిగేలా ఉపయోగపడిందన్నారు.

అగ్రిషోతో అధునాత‌న ప‌ద్ధ‌తుల‌పై అవ‌గాహ‌న‌
ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అగ్రిషోతో అధునాత‌న ప‌ద్ధ‌తులపై అవ‌గాహ‌న పెరుగుతోంద‌న్నారు. స్టాళ్లలో ఏర్పాటుచేసిన నూతన వరి వంగడాలు, తోటల పెంపకం, గడ్డి కోసే యంత్రాలు, వ్యవసాయదారిత పరిశ్రమల ఏర్పాటు పై అవగాహన పెంచుకునేందుకు రైతులు ఆసక్తికరపరచడం కనిపించిందని అన్నారు. వ్యవసాయధారిత రంగాలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.

- Advertisement -

ఇలాంటి షోలు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఇలాంటి అగ్రిషోలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. చదువుకున్న యువ రైతులు సాగు పద్ధతులపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నిర్వాహకుడు రాజేందర్ రెడ్డి. వివిధ విత్తన కంపెనీలు, యంత్రాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement