హైదరాబాద్ : రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరణ్య భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్ & బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత్ కుమార్, ఆలయ ఇంచార్జీ ఈవో రామకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. క్యూ కాంప్లెక్స్ లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాష్ రూమ్స్ లో పరిశుభ్రత, కొండపైన చలువ పందిళ్ళు ఏర్పాటు, మురుగునీటి కాల్వల నిర్వహణ, క్యూ కాంప్లెక్స్ లో ఫ్యాన్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడటం, వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్లు అందుబాటులో ఉండేలా చూడటం, కొండ కింద మొబైల్ టాయ్ లెట్లు ఏర్పాటు, ఇతర వసతుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. అకాల వర్షం వల్ల ఉత్పన్నమైన సమస్యలు, పునరుద్ధరణ చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూలిన పందిళ్లు, వాననీటి లీకేజీలు, ఇతర నష్టాలపై ఆరా తీశారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా వర్షకాలంలోగా వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేశారన్నారు. స్వయంభు దర్శనాల ప్రారంభం తర్వాత అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని తెలిపారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని వేళ్లేలా ఎల్లవేళళా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. 79 మిల్లీమీట్లర్ల అకాల భారీ వర్షం కారణంగా నిర్మాణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు కొనసాగుతుండటంతో పైప్ లైన్ లో మట్టి, ఇసుక కూరుకుపోయి నీరు నిలిచిపోయిందే తప్పా నాసిరకం పనుల వల్లో, నిర్మాణ లోపం వల్లో అలా జరగలేదని స్పష్టం చేశారు. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరించారని, అకాల వర్షాలతో ఉత్పన్నమైన చిన్న చిన్న సమస్యలను అధిగమించామని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు సరికాదు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement