విచారణ నుంచి మినహాయింపు
అయన ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశం
నిరంతరం సిసి కెమెరాలతో పర్యవేక్షణ
విచారణ ఈ నెల 24వ తేదికి వాయిదా
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సినీ నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను పోలీసులను సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా.. కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. పిటిషనర్ తరుపులన సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి , మురళి మనోహర్ వాదనలు వినిపించారు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తికి సరైన రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమైందని కోర్టు దృషికి తెచ్చారు.. ఆయన ఇంటి వద్ద సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడం వల్లే ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు.. ఇక అయన ఇంటిపై దౌర్జన్యం జరిగితే ఆయనకే పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలవడం సమంజసం కాదని వాదనలు వినిపించారు.. వాదనలు విన్న ధర్మాసనం పోలీసు విచారణ నుంచి మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది.