హైదరాబాద్ – ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. డిజిపి కార్యాలయంలో ఆయన నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలు, డ్రగ్స్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
సమాజానికి డ్రగ్స్, సైబర్ క్రైమ్ పెద్ద సవాలుగా మారాయని, ఈ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఉందన్నారు. డ్రగ్స్ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని, విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
41 శాతం కోర్టు శిక్షలు పెరుగగా జీవిత ఖైదు 39 శాతం పెరిగిందన్నారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించామని చెప్పారు. 1 లక్షా 38 వేల ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా అందాయని తెలిపారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ డయల్ 100, 112 రాష్ట్రంలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోందని ఈ ఏడాది వీటి ద్వారా 16 లక్షల కాల్స్ వచ్చాయని చెప్పారు. వీటికి సగటున 7 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యామన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ లీడర్‌గా ఉందన్నారు. నిరంతర నిఘాతో నేరాలను అదుపు చేస్తున్నామని డిజిపి రవి చెప్పారు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఒక్క చోట కూడా ఎన్నికలలో ఎటువంటి వివాదాలు జరగలేదన్నారు. ఇక రాష్ట్రంలో ఒక శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు.