Tuesday, November 26, 2024

Crime: విశాఖ నుంచి గంజాయి స్మగ్లింగ్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ముఠా

Warangal: గంజాయి సప్లయ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.ఈ గ్యాంగ్ లో ఇద్దరు చిక్కగా.. ఒక మహిళతో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలోఉన్నారు. వారి నుంచి రూ.3.20లక్షల విలువైన 32 కిలోల గంజాయితో పాటు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీలోని విశాఖపట్నం జిల్లా ఎరమంచలి మండలం పెద్దగొల్లపాలెం గ్రామానికి చెందిన ద్వారపూడి మణికుమార్, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తోవనగడ్డ గ్రామానికి చెందిన బానోత్ బిచ్యాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

వరంగల్ సీపీ తరుణ్ జోషీ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస్తారు. వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి ఆ ప్యాకేట్లను నిందితురాలు మహేశ్వరీకి ఇచ్చి రైలు ద్వారా మహరాష్ట్ర, తెలంగాణలోని ములుగు, నర్సంపేట ప్రాంతాలకు చేరవేసేవారు. నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేసే సమయంలో ఎవరికి అనుమానం రాకుండా ఖరీదైన బ్యాగుల్లో భద్రపర్చి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు.

ఈ తరహాలో 4 సంవత్సరాల నుంచి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ రోజు గంజాయి సప్లయ్ చేస్తుండగా వరంగల్ రైల్వే స్టేషన్ బయట అదుపులోకి తీసుకోన్నారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్.ఐ స్వామి, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు ,శ్రీకాంత్, సృజన్, మహేందర్, శ్రీనివాస్, ఆలీ, చిరులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement