హైదరాబాద్, ఆంధ్రప్రభ: అనుమతులు లేని ఆసుపత్రులపౖౖె కొరఢా ఝులిపించేందుకు నాలుగు రోజులుగా వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ముమ్మరదాడులతో యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటిదాకా నిర్వహించిన దాడుల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అర్హత , అనుభవం లేని వైద్యులతో శస్త్ర చికిత్సలు జరుపుతుండడంతోపాటు ఆర్‌ఎంపీ వైద్యులతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కఠోర వాస్తవాలు దాడుల్లో బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయివేటు ఆసుపత్రులపై వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న దాడులు, తనిఖీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. నాలుగు రోజుల్లో 1569 ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగగా 81 ఆసుపత్రులను సీజ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రయివేటు ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌ల్లో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అర్హులైన వైద్యులు లేకున్నా, సరైన వైద్య సదుపాయాలు లేని, అనుమతులు లేని, ఉన్నా రెన్యువల్ చేసుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు.
ఆకస్మిక తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలను ఆయా జిల్లాల వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చట్టవిరుద్ధంగా అబార్షన్లు, శస్త్ర చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్‌ఎంపీ వైద్యులను వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 1569 ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగించగా 81 ప్రయివేటు ఆసుపత్రులను సీజ్ చేశారు. ఈ 81 ఆసుపత్రులు నిబందనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, సరైన అనుమతులు కూడా లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. అదే సమయంలో సదుపాయాలు సరిగ్గా నిర్వహించని, సరిదిద్దుకునే లోపాలు ఉన్న 416 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 68 ఆసుపత్రులకు జరిమానా విధించారు. కాగా… సీజ్ చేసిన ఆసుపత్రుల్లో సంగారెడ్డి జిల్లాలో 16, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 14 చొప్పున, రం గారెడ్డి జిల్లాలో 10 ఆసుపత్రులు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 204, కరీంనగర్‌లోని 210, హైదరాబాద్‌లోని 130 ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి.