Saturday, November 23, 2024

‘లక్ష్మీదేవిపల్లి’పై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న సీపీఎం

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న ప్రభుత్వ ఉదాసీనత కారణంగా అనేక సమస్యలపై సిపిఎం నిర్మాణాత్మకమైన ఉద్యమాలతో పాలకులను వెంటాడతామని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగాల్ల భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సిపిఎం మీడియా సమావేశంలో కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. రాజు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన సీనియర్ నాయకులు సాయిబాబు, ప్రశాంత్, ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాడిగల్ల భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు అని పేర్కొన్నారు.

ముఖ్యంగా జిల్లాలోని పోడు భూముల వ్యవహారంలో ప్రభుత్వం వేధింపుల వైఖరి విడనాడాలని హెచ్చరించారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్ ప్రాంతాల్లోని అడవుల్లో నివసిస్తున్న వారిని చట్టాలకు విరుద్ధంగా అడవుల నుండి వారిని తరిమి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘన చేస్తుందని ఆరోపించారు. అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారని విమర్శించారు. పోడు భూములలో నివసించే పేదలను నిర్వాసితులను చేయొద్దని పేర్కొన్నారు. మరోవైపు రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలు ప్రభుత్వానికి బానిసలుగా మారారని రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులే సీఎం కాళ్లపై పడుతున్నారని విమర్శించారు.

జిల్లాలో ఎన్నో పేరెన్నికగన్న పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. మంకాల్, ఆదిభట్ల, రాచకొండ తదితర ప్రాంతాల్లో భూములు కోల్పోయిన వారికి సదరు పరిశ్రమల్లో కనీసం ఉపాధి అవకాశాలు కూడా దక్కలేదని అన్నారు. ఎవరికైనా ఉపాధి లభిస్తే అది మరుగుదొడ్లు కడిగే ఉద్యోగాలు తప్ప మరొకటి కాదని విమర్శించారు. ప్రభుత్వం పేద ప్రజల వద్ద 700 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించి రాంకీ సంస్థకు అప్పనంగా అప్పజెప్పి పేదలకు ఎంతోకొంత చెల్లించి ప్రభుత్వ పెద్దలే అసైన్డ్ భూములను దోచుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న సమస్యలపై షాద్ నగర్ లో జరిగిన 9వ సిపిఎం పార్టీ మహాసభలో ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశ పెట్టినట్లు భాస్కర్ వివరించారు. ఇందులో ప్రధాన సమస్యలపై పోరాడాలని కార్మికుల సమస్యలపై స్పందించే విధంగా ఉద్యమాలు నిర్మించాలని, నిరుద్యోగులకు భ్రుతి, టిఎస్ పిఎస్సిపై ఉద్యమించాలని మహా సభలో తీర్మానం చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు పరచాలని, దళితులపై దాడులు అరికట్టాలనీ, మహిళా సమస్యలపై స్పందించాలని, విద్యారంగ సమస్యలపై అదే విధంగా దళిత, గిరిజన సమస్యలపై స్పందించే విధంగా షాద్ నగర్ మహాసభలో తీర్మానాలు ప్రవేశ పెట్టి ఆమోదించినట్లు భాస్కర్ ఈ సందర్భంగా వివరించారు.

కేవలం భూగర్భజలాల పైనే ఆధారపడిన షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రగల్భాలు పలికి ఎన్నికల వేళ స్వయంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నో హామీలు గుప్పించారని, కానీ నేటి వరకు రిజర్వాయర్ నిర్మాణం ఊసే లేదని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజు విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి నిర్మాణం వద్ద కుర్చీ వేసుకుని పని చేపిస్తాను అని ప్రజల ముందు ప్రగల్భాలు పలికిన కెసిఆర్ ఇప్పుడు మొహం చాటేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సిపిఎం పార్టీ రాజీలేని పోరాటానికి సిద్దం అవుతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవని దీనిపై స్పందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా షాద్ నగర్ పట్టణంలో మున్సిపాలిటీ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. ముక్కుపిండి ప్రజల వద్ద పన్నులు వసూలు చేస్తూ, సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో షాద్ నగర్ మున్సిపాలిటీ విఫలమైందని ఆరోపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement