Tuesday, November 26, 2024

మార్చి 25 నుంచి సిపిఐ పాదయాత్ర.. కూనంనేని సాంబశివరావు

హనుమకొండ : వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ది, విభజన హామీల అమలుకై సిపిఐ ఈనెల 25 నుంచి పాదయాత్ర చేపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శుల, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అద్యక్షత వహించగా.. కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పాలక పార్టీలు విఫలం అయ్యాయని, హామీల అమలు కోసం ప్రజలను సమీకరించి పోరాడాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందన్నారు. మోడీ నమ్మిన బంటు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టారని, ఆదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విపక్ష పార్టీల నాయకులపై సిబిఐ, ఈడీలను ప్రయోగిస్తున్న మోడీ ప్రభుత్వం ఆదానీపై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ది, విభజన హామీల అమలుకై సిపిఐ ఈనెల 25 నుంచి పాదయాత్ర చేపడుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని, ఈ పాదయాత్రకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, సిహెచ్ రాజారెడ్డి, బి.విజయ సారథి, రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వర రావు, పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, బుస్సా రవీందర్, దండు లక్ష్మణ్, మండ సదాలక్ష్మి, గుండె బద్రిబద్రి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement