Tuesday, November 26, 2024

దాడులకు భయపడం-భూములను వదులుకోం- నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి

భూపోరాటాలలో దాడులకు భయపడం అని.. పేదలకు ఇండ్ల స్థలాలు దక్కే వరకూ భూములను వదులుకోమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, సిపిఐ రాష్ట్ర ఇంచార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి స్పష్టం చేసారు. మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రం సమీపంలోని గుండ్ల సింగారంలో గుడిసె వాసులపై భూ కబ్జా దారుల దాడిలో తీవ్రంగా గాయపడిన పేదలను పరామర్శించేందుకు బుధవారం హన్మకొండకు విచ్చేసిన నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి గాయపడిన గుడిసె వాసులను పరామర్శించారు.ఈ సందర్భంగా గుండ్ల సింగారంలో భూమాఫియా ఆగడాల గురించి, పేదలపై జరిగిన దాడి తీరును వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హన్మకొండ బాల సముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ పేదలపై జరిగిన దాడి చాలా భాదాకరమని, ఈ దాడిలో సుమారు 40 మంది గాయపడ్డారని, దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఇంతటి ఘటన జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చూస్తుంటే వారు భూ కబ్జా దారులకు మద్దతునిస్తున్నట్లు స్పష్టమవుతున్నదని అన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుంటే ప్రైవేటు వ్యక్తులు ఎలా దాడి చేస్తారని, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. గుండ్ల సింగారంలో జరిగిన దాడిలో బిజెపి కార్పరేటర్ రవి నాయక్, మరో 40 మంది పాల్గొన్నారని, వారికి టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మద్దతునిస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలవైపా, భూ కబ్జా దారులవైపో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గుండ్ల సింగారంలో జరిగిన దాడిపై, పోలీసుల తీరుపై రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వ భూమిపై కోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని తెలిపారు. తాము ఇండ్ల స్థలాలు సాదించుకునేందుకు న్యాయ బద్దంగా వెలుతున్నామని, గుండ్ల సింగారం భూములను వదిలి పెట్టమని అన్నారు. సిపిఐ రాష్ట్ర ఇంచార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భూ పోరాటాలతో సిపిఐ ప్రాబల్యం పెరుగుతున్నదన్న దురుద్దేశంతోనే స్తానికేతురల పేరుతో గుడిసె వాసులపై దాడి చేసారని అన్నారు. స్థానికులలో కూడా పేదలు ఉంటే గుడిసెలు వేసుకోవచ్చునని, ఇండ్ల స్థలాలు అవసరం ఉన్న అర్హులైన వారెవరైనా గుడిసెలు వేసుకోవచ్చునని అన్నారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నందునే సిపిఐ భూపోరాటాలు నిర్వహిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలు దక్కే వరకూ పోరాడుతామని, గురువారం నుండి హనుమాన్ జంక్షన్ లో సిపిఐ ఆద్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సిపిఐ హన్మకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, షేక్ బాష్ మియా, పనాస ప్రసాద్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వలీ వుల్లా ఖాద్రి, మారుపాక అనిల్ కుమార్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్, నాయకులు బుస్సా రవిందర్, దండు లక్ష్మణ్ గన్నారపు రమేష్, మండ సదాలక్ష్మి, మద్దెల ఎల్లేష్, ఆదరి శ్రీనివాస్, ఉట్కూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement