Friday, November 22, 2024

ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే… వామ‌ప‌క్షాల టార్గెట్

(హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా రానున్న ఎన్నికల నేపథ్యంలో వామపక్షాలు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభల్లో అడుగుపెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో రెండు కమ్యూనిస్ట్‌ పార్టీలు బోణీకొట్టలేదు. 2014 అసెంబ్లి ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తెలంగాణాలో చెరో సీటును మాత్రం పొందాయి. 2018 ఎన్నికల్లో ఉన్న రెండు స్థానాల్ని కోల్పోయాయి. దీంతో ఇప్పుడు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రెండు అసెంబ్లిdల్లోనూ సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిధ్యం కొరవడింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్షాలు అవతరించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌నుబలంగా ఢీ కొట్టగలిగాయి. లోక్‌సభ నుంచి శాసనసభ వరకు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాయి. రాన్రాను అంతర్గత ఆధిపత్య పోరాటాలు, నాయకుల మధ్య అనైక్యత, సిద్ధాంతాలకు దూరంగా సొంత ప్రయోజనాలకు పరిమితం కావడం వంటి కారణాలతో ఆ పార్టీలు ప్రజాదరణను కోల్పోయాయి. ఇప్పటికీ కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఉనికి ప్రదర్శిస్తున్నాయి.

కాగా తెలుగు రాష్ట్రాల్లో పూర్వవైభవ సాధనకు వామపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ ప్రభంజనంలో వామపక్షాలు బలమైన శక్తిగా కొన్నాళ్ళు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఎన్‌టీఆర్‌తో పొత్తులో 37 స్థానాల్లో ఆ పార్టీలు పోటీ చేశాయి. 34 స్థానాల్లో గెలుపొందాయి. ఉమ్మడి ఏపీలో గరిష్ట స్థానాల్ని సాధించడం ఎన్‌టీఆర్‌ హయాంలోనే. 1999లో రెండుపార్టీలు కలసి ఆరుసీట్లలో మాత్రమే విజయానికి పరిమితమమ్యాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లతో కలసి పోటీ చేశాయి. సీపీఐ 12చోట్ల పోటీపడి ఆరుచోట్ల గెలుపొందింది. సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేసి 9 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2009నాటికి కాంగ్రెస్‌కు వామపక్షాలు దూరమయ్యాయి. టీడీపీతో కలిపి మహాకూటమిలో భాగమయ్యాయి.

ఈ సారి సీపీఐ 4 స్థానాల్లో, సీపీఎం ఓ స్థానంలోనే గెలుపొందాయి. రాష్ట్ర విభజనానంతరం ఈ పార్టీలు పూర్తిగా తెలంగాణాకే పరిమితమయ్యాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణాలో రెండు స్థానాలు గెలుపొందినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బోణీచేయలేదు. ఆ తర్వాత తెలంగాణాలోనూ ఆ సీట్లు కోల్పోగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లిలో ఇప్పటికీ సీపీఐ, సీపీఎంలు అడుగెట్టలేక పోయాయి. దీంతో ప్రజలకు, పార్టీలకు మధ్యదూరం పెరిగింది. ఈసారి ఎన్నికల్లోనైనా కనీసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లిdల్లోకి అడుగెట్టాలని ఈ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. మునుగోడు అసెంబ్లి ఉపఎన్నికల్లో వామపక్షాలు బేషరతుగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలుపునకు వామపక్షాల మద్దతు కూడా ఓ కారణమంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో తెలంగాణాలో బీఆర్‌ఎస్‌తో పొత్తుంటుందని వామపక్షాలు ఆశించాయి.

ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారి జాతీయ పార్టీగా అవతరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ పోటీ చేస్తోందని పనిలో పనిగా తెలంగాణాతో పాటు ఏపీలో కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తెట్టుకుని ఎన్నికల్లో తలపడొచ్చని అంచనాలేసింది. అయితే తెలంగాణాలో వామపక్షాలతో పొత్తుకు కేసీఆర్‌ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఓ దశలో పొత్తుమాటెలా ఉన్నా సీట్ల సంఖ్యకు సంబంధించి వామపక్షాల ఆకాంక్షను ఆమోదించే ప్రసక్తేలేదని బీఆర్‌ఎస్‌ నేతలు తేల్చేశారు. దీంతో ఏపీలో కూడా బీఆర్‌ఎస్‌తో కలసి పోటీచేసే అవకాశాల్లేవని ధ్రువీకరించుకున్నారు. ఈ దశలో జాతీయ స్థాయిలో ఎన్‌డీఏకు ప్రత్యామ్నాయ రూపకల్పనకు విపక్షాలన్నీ నడుంకట్టాయి. ఇటీవలె పాట్నాలో 17పార్టీలు సమావేశం జరిపాయి. ఇవన్నీ మోడి, ఎన్‌డీఎను వ్యతిరేకిస్తూ తీర్మానించాయి.

- Advertisement -

యూపీఏకు మద్దతుగా నిలబడాలని ఆకాంక్షించాయి. వీటికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలసి వామపక్షాలు పోటీ చేసే అవకాశం స్పష్టమౌతోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా ఇదే పొత్తు కొనసాగనుంది. తెలంగాణాలో కాంగ్రెస్‌ కాస్తోకూస్తో ఉనికి ప్ర దర్శిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఆ పార్టీని జనం విశ్వసించడంలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తమకు తీవ్ర అన్యాయం చేసిందన్న ఆగ్రహం సీమాంధ్రుల్లో ఇంకా చల్లారలేదు. గత రెండు అసెంబ్లిd ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో కనీసం ఖాతా కూడా తెరవలేక పోయింది. వామపక్షాలిప్పుడు అదే పార్టీతో కలసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో వరుసగా మూడోసారి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు చతికిలబడతాయా లేక సానుకూల ఓటును పొంది అసెంబ్లిdలోకి అడుగెడతాయా అన్నది విశ్లేషకుల్నే కాకుండా వామపక్ష నాయకులకు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement