Sunday, November 17, 2024

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హయత్‌నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు చేశామని సీపీ తెలిపారు. హయత్‌నగర్‌లోని పసుమాములలో రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశామని వెల్లడించారు. పత్తి, మిర్చి, వేరుశెనగ విత్తనాల గడువు ముగిసినప్పటికీ, మళ్లీ ప్యాక్‌చేసి వాటిని అమ్ముతున్నారని చెప్పారు. అలాంటివారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పారు. నకిలీల విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై గత నాలుగేండ్లలో 10 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదుచేశామన్నారు. 

నిన్న ఒకే రోజే మూడు కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం కోటి 16 లక్షల విలువ గల నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు వివరించారు. రెండవ కేసులో 50 లక్షల విలువ గల నకిలీ విత్తనాలు పట్టుకున్నామన్నారు. గోపాల్ కమల్ కిషోర్, అలియాస్ గోపాల్ అగర్వాల్ అనే యజమానిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గోపాల్ అగర్వాల్ పై కూడా పిడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని తెలిపారు. BT-3 విత్తనాలు భారత దేశంలో బ్యాన్ ఉందన్నారు. ఇలాంటి విత్తనాలను ఇక్కడికి తీసుకువచ్చి రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. వనస్థలిపురం లో ఎస్వోటి టీమ్ నేతృత్వంలో దాడులు నిర్వహించినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

https://twitter.com/RachakondaCop/status/1403608766243737601
https://twitter.com/RachakondaCop/status/1403611863925985292
Advertisement

తాజా వార్తలు

Advertisement