హైదరాబాద్ – పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలో స్మగ్లర్ హీరో అని, కానీ స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయన్నారు. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్లో పట్టుకున్నారని వెల్లడించారు.
సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ప్రజలు ఆదరించాలని సూచించారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉందన్నారు. సినిమాలను తాము గౌరవిస్తామని, సినిమాలు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమేనని అన్నారు. కానీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమన్నారు.