ములుగు – ప్రజల సొమ్ముతో ప్రభుత్వ షోకులా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఇంద్రవెల్లి సభకు భారీగా జనం తరలిరావడం చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కవిత ఆరోపిస్తున్నట్లుగా ఇంద్రవెల్లి సభను ప్రభుత్వ నిధులతో నిర్వహించలేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిధులతోనే ఇంద్రవెల్లి సభను నిర్వహించామని స్పష్టం చేశారు. మీలా పార్టీ కార్యక్రమాలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయలేదని కౌంటర్ ఇచ్చారు.
కాగా, రూ.500కే మహిళలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కవిత అభ్యంతరం పై సీతక్క మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని.. ప్రియాంక గాంధీ కాలి గోటికి కూడా కవిత సరిపోదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీతక్క మండిపడ్డారు.