కెటిఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
అనాడు కేంద్రం అమ్ముతుంటే ఏం జేశారు
ప్రైవేటు వాళ్లకు అమ్మకం మొదలు పెట్టిందే మీరే
అరవింద, అవంతికాలకు రెండు బ్లాక్ కట్టబెట్టారుగా
తాము బొగ్గు గనుల ఆంక్షను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాం
సింగరేణి పరిరక్షణకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది
సింగరేణిలో బొగ్గు గనుల వేలంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలే కాదు.. ట్వీట్ ఫైట్లూ కంటిన్యూ అవుతున్నాయి. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ నాటి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వేలం పాట కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏంటని ప్రశ్నించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని ఎక్స్ వేదికగా నిలదీశారు.
ఇక కేటీఆర్ ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టూ పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా, కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అడుగడుగునా వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందని అన్నారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందని చెప్పారు. అప్పుడు బీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడలేదు..? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని తెలిపారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క రాసిన లేఖను జత చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కును కాపాడి తీరుతాం అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
కెటిఆర్ రీ ఎన్ కౌంటర్ …
సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బిజెపి యత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్ ట్విట్ పై ఘాటుగా స్పందించిన కెటిార్ తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బిఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు.
”మీ ప్రభుత్వంలో మాదిరిగా మా ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదు. చివరి రౌండ్‌లో 2 బ్లాకులను కేంద్రం ఏకపక్షంగా వేలం వేసింది. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే యత్నం చేస్తున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్, భాజపా భాగస్వాములు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్ సహకారం అందించింది. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారు” అని కేటీఆర్ విమర్శించారు.