న్యూ ఢిల్లీ – తెలంగాణలో బీఆర్ఆఎస్ , బీజేపీ వైఖరి ఒకేరకంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ హెడ్ క్వార్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
140 ఏళ్ల చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందని అంటూ అదే నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు 40 ఏళ్ల సీనియార్టీ మాత్రమే ఉన్న బీజేపీ స్వల్పకాలంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు రేవంత్. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్ధంగా పని చేస్తుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతి ఎలా ఉందో గమనించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే దేశాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు, ప్రణాళికలు రచించబడతాయన్నారు. ఇక తెలంగాణలో చట్టబద్దమైన పాలన సాగుతున్నదన్నారు.