Tuesday, October 1, 2024

Counter – మార్పు అంటే ఇదా… ఆహారంలో బ‌ల్లులు, ఎలుక‌లు – రేవంత్ సర్కార్ పై కెటిఆర్ గరంగరం

నాడు కాంగ్రెస్ పాలనలో హాస్టళ్లలో
పురుగుల అన్నం.. నీళ్ల చారు..
ఇప్పుడు బల్లిపడిన టిఫిన్లు,
చిట్టెలుక పడిన చట్నీలు
విషాహారం తిని జీవితాలు హ‌రి
విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?
రేవంత్ పై కెటిఆర్ గ‌రం గ‌రం ..

ఆంధ్ర‌ప్ర‌భ – హైద‌రాబాద్ స్మార్ట్ ప్ర‌తినిధి – మార్పు రావాలి… కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని… అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక’ అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ… కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు.. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు అంటూ ఎద్దేవా చేశారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదంతమైందని… నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులకు వాంతులు చేసుకున్నారని గుర్తు చేశారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో ఇక్కడి విద్యార్థులు బెంబేలెత్తారన్నారు.

ఈ విషాహారం తింటే . విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ??? అని ప్రశ్నించారు. కలుషిత ఆహారం వల్ల… పిల్లలు ఆడుకోవాల్సిన వయస్సులో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ వచ్చిపడిందని… దీంతో వారికి ఈ అస్వస్థత అని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని లేదంటే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement