వెళ్లకూడదని రేవంత్ నిర్ణయం
దీనిపై కెటిఆర్ ఘాటు వ్యాఖ్య
తాము బహిష్కరిస్తే తప్పన్న రేవంత్ ..
ఇప్పడేం సమాధానం చెబుతారంటూ నిలదీత
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిథి : నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర్ బాయ్‌కాట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టిందని, ఇరువురు కుమ్మక్కయ్యారని ఆరోపించిందని చెప్పారు. మరి ఇప్పుడు నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీని చోటే భాయ్ ఎందుకు కలవానుకోవడం లేదు?, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని ఎక్స్ వేదికగా నిలదీశారు.
తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని నిలదీయడానికి నీతి అయోగ్ సమావేశం ఒక మంచి అవకాశమని వాదించారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లాలని డిమాండ్ చేశారు. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై కెటిఆర్ ఘాటుగా స్పందించారు.. మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తా తప్పాఅంటూ రేవంత్ ను నిలదీశారు.