మెట్‌పల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, గాంధీ కుటుంబానికి తెలంగాణకు మధ్య విద్రోహక సంబంధం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని కవిత నిప్పులు చెరిగారు.
జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని కవిత సూచించారు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను అని కవిత వ్యాఖ్యానించారు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని తప్పకుండా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు.
సింగరేణి కార్మికులకు భారాస హయాంలోనే న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. భారాస మేనిఫెస్టో బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగా ఉందన్నారు. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్‌లో చనిపోయిన వారికీ ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కవిత స్పష్టం చేశారు.