హైదరాబాద్ – మహిళా ఉద్యోగుల నెలసరి దినాలు వేతనంతో కూడిన సెలవుగా ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు.. ఓ మహిళగా ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్వయంగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రే రాజ్యసభ సాక్షిగా రుతుక్రమ పోరాటాలను కొట్టిపారేయడం నిరుత్సాహం కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘రుతుక్రమం అంగ వైకల్యం కాదని, ఆ సమయంలో వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదంటూ, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం విచారం కలిగించింది. ఒక మహిళగా అటువంటి అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా అనిపిస్తోంది. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ అని గుర్తించాలి. వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదని తిరస్కరించడమంటే అసంఖ్యాకమైన స్త్రీలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్టే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవికమైన సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం ఒక మహిళగా విస్తుగొల్పుతోంది. విధాన రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన సమయం ఇది’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కవిత .