Friday, November 22, 2024

Counter – త‌ప్పులు త‌డ‌కగా విద్యుత్ శ్వేత‌ప‌త్రం – గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించిన జ‌గ‌దీష్ రెడ్డి

హైద‌రాబాద్ – దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ తన స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమెట్‌ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసన సభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితిని ఆయన వివరించారు.

2014 జూన్‌ 2 నాటికి విద్యుత్‌ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని.. ఆస్తులు పెంచామని వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. పరీక్షలు వస్తున్నాయంటే కిరసనాయిల్‌ దేవులాడుకురావడం.. క్యాండిల్స్‌ కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

అలా బోరుబావి దగ్గరికి పోయాక కరెంటు పోతే.. రెండు గంటలా? మూడు గంటలా? నాలుగు గంటలా? ఎన్ని గంటలు అక్కడే ఉండాలో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. బిందెడు నీళ్లు లేకుండా ఇంటికి పోతే ఎసరు పెట్టే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్‌ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్‌ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని అన్నారు. విద్యుత్ రంగాన్ని అన్ని విధాల బ‌లోపేతం చేశామ‌ని, ఆస్తులు పెంచామ‌ని పేర్కొన్నారు.. నిరంత‌రం వెలుగులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ తేల్చి చెప్పారు జ‌గ‌దీష్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement