హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ మోసాలపై పోరాడుతూ.. ప్రజలకు అండగా నిలబడుతున్న బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని, ఈ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పక్కదారి పట్టించడానికి, వీటిపై రైతుల్లో, ప్రజల్లో చర్చకు రానివ్వకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని పేర్కొన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన చెత్త కేసు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ రైతాంగాన్ని మేల్కొలోపుతున్న కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. కేటీఆర్‌పై పెట్టిన కేసు విషయంలో చట్టపరంగా మాకున్న అవకాశాలను వినియోగించుకుంటున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
కేటీఆర్ మీద నమోదు చేసిన కేసు అక్రమం అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారు. సంతోషపడడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని. మేం రైతుబంధు ఇచ్చి సంబురాలు చేసుకున్నాం. మీరు కేసులతో సంబురాలు చేసుకుంటున్నారు. 24 గంటల కరెంట్, కోటిన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి అన్ని వర్గాలతో సంబురాలు నిర్వహించాం. వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాలను అగ్రభాగాన నిలిపాం. ఈ రాష్ట్రం తలెత్తుకునే విధంగా కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణను తయారు చేశామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.