హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్‌ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్‌ఎంబీ రెండో మీటింగ్ మినిట్స్‌లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు.
బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు.
ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్‌రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్‌ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.