హైదరాబాద్ – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కావాలనే చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
రాష్ట్ర సర్కార్ నుంచి రాజ్ భవన్ కు గవర్నర్ కు ఆమోదానికి అసెంబ్లీ పంపిన బిల్లును కానీ, మంత్రి వర్గం పంపిన సిపారసులను కానీ కావాలనే రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని వివరించారు. గతంలో సైతం ఒక సారి ఇలాగే ఎమ్మెల్సీల నియామకంలో గవర్నర్ వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ఆమోదించాలని కానీ ఇలా తిరస్కరించడం సబబు కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఇలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలకు రాజకీయ అనుభవం ఉందని వారిని సేవారంగంలో ఎమ్మెల్సీలను చేస్తే తప్పేముందని అడిగారు.